Home సినిమా టాలీవుడ్‌లో మ‌రో విషాదం

టాలీవుడ్‌లో మ‌రో విషాదం

0

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సినీ న‌టుడు వైజాగ్ ప్ర‌సాద్ ఇక లేరు. ఆదివారం తెల్ల‌వారుజామున ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గుండెపోటు వ‌ల్ల‌న వైజాగ్ ప్ర‌సాద్ మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు ఆదివారం తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా గుండెపోటు వ‌చ్చింది. బాత్‌రూంకు వెళ్లిన ఆయ‌న అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే నిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా. అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్లడించారు. వైజాగ్ ప్ర‌సాద్ మృతికి ప‌లువురు సంతాపం తెలిపారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

మా అధ్య‌క్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం వైజాగ్ ప్ర‌సాద్ మృత‌దేహం నిమ్స్ మార్చురీలో ఉన్న‌ట్లు స‌మాచారం. వైజాగ్ ప్ర‌సాద్ కుమారుడు, కూతురు అమెరికాలో ఉంటున్నారు. దీంతో వారి కోసం మృత‌దేహాన్ని మార్చురీలో ఉంచిన‌ట్లు తెలుస్తోంది. అనేక సినిమాల్లో న‌టించిన వైజాగ్ ప్ర‌సాద్‌, త‌న న‌ట‌న‌తో ఎంతోమందిని అల‌రించారు. 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ సినిమా ద్వారా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న‌, నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లాతో పాటు ప‌లు సినిమాల్లో న‌టించారు.

వైజాగ్ ప్ర‌సాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయన స్వ‌స్థ‌లం విశాఖ‌ప‌ట్నంలోని గోపాల‌పురం.ఆయ‌న కుమారుడి పేరు రత్నకుమార్‌. కుమార్తె పేరు రత్నప్రభ. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా.. ఇలా అన్ని రకాల పాత్రలోను న‌టించిన‌ ఆయ‌న ప్రేక్ష‌కుల మ‌న్న‌ల‌ను సంపాదించుకున్నారు.

Exit mobile version