25.5 C
Amaravathi
Tuesday, September 28, 2021
spot_img

కేసీఆర్ ని ఎదిరించినందుకే ‘ఈఎస్ఐ’ స్కాం బయటకి వచ్చిందా…?

తెలంగాణ‌లో జ‌రిగిన ఈఎస్ఐ కుంభ‌కోణం ఇప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మెడ‌కు చుట్టుకోనున్న‌దా..? ఈ స్కాంతో మంత్రి ఈటెల‌తో పాటు మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి అల్లుడు, కార్పోరేట‌ర్ శ్రీ‌నివాస‌రెడ్డి కూడా పీక‌ల్లోతు కుంభ‌కోణంలో చిక్కున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వ ఈ ఈఎస్ఐ కుంభ‌కోణాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మెడ‌కు చుట్ట‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతుంది. కార్మికుల కుటుంబాల‌కు వైద్యం అందించేందుకు ఏర్ప‌డిన సంస్థే ఈఎస్ఐ. ఈ సంస్థ నుంచి వైద్యం కోసం ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో, కొన్ని ముఖ్య ప‌ట్ట‌ణాల్లో ఈఎస్ఐ ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ప్ర‌తి కార్మికుడు త‌న కుటుంబం వాటాగా ప్ర‌తినెల కొంత మొత్తాన్ని త‌మ వేత‌నంలో నుంచి నేరుగా జ‌మ‌చేస్తారు. అయితే ఈ పేద కార్మికుల పొట్ట గొట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ‌లోని కొంద‌రు అధికారులు కుమ్ముక్కై ఈ భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఈఎస్ఐ లో ప‌నిచేసే కొంద‌రు ఇచ్చిన స‌మాచారం మేర‌కు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏసీబీని రంగంలోకి దింప‌డంతో అస‌లు కుంభ‌కోణం బ‌య‌టికొచ్చింది. దాదాపుగా రూ.200కోట్ల కుంభ‌కోణం జ‌రిగిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది కూడా. ఏసీబీ ప్ర‌త్యేకంగా ఈఎస్ఐ డైరెక్ట‌ర్ క‌ల‌కుంట దేవికారాణి తో పాటుగా జాయింట్ డైరెక్ట‌ర్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్‌, ప‌లువురు ఫార్మాసిస్టులు, కొంద‌రు ఉద్యోగులు ఈ స్కాంలో ఉన్న‌ట్లు రుజువైంది. దీంతో ఏసీబీ మొత్తం ఏడుగురుని రెండు ద‌ఫాలుగా అరెస్టు చేసింది. ఈఎస్ఐ డైరెక్ట‌ర్ దేవికారాణి త‌న కొడుకుతో ఫార్మాస్యూటిక‌ల్ కంపెనీని పెట్టంచి ఏకంగా అదే కంపెనీ నుంచి మందులు కొనుగోలు చేసి ఇష్టారాజ్యంగా దోపిడికి పాల్ప‌డ్డారు. అయితే ఈ దోపిడి కేవ‌లం ఈ ఏడాది జ‌రుగుతున్న‌ది కాదు.. ఇది దాదాపుగా ఆరేళ్ళుగా సాగుతున్న ప్ర‌క్రియ‌గా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు కొలువుదీరిన‌ప్ప‌టి నుంచే ఈ కుంభ‌కోణానికి భీజం ప‌డింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే ఈ కుంభ‌కోణం ఇప్ప‌టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను బ‌లి చేసేందుకు స‌ర్కారు కుట్ర ప‌న్నిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఈటెల రాజేంద‌ర్ గులాబీ బాసులం అని చేసిన కామెంట్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్, ఈటెల‌పై కోపంతో ఉన్నార‌ట‌.

అయితే ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనే ఈటెల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని అంతా భావించారు. కానీ బీసీ సంఘాల నుంచి, తెలంగాణ వాదుల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే భ‌యంతో ఈటెల‌ను కేసీఆర్ క‌దిలించ‌లేక పోయారు. అయితే కేసీఆర్ స్వ‌భావం తెలిసిన‌వారు చెప్పే మాట ఏంటంటే కేసీఆర్ ప‌గ‌బ‌డితే అది చాలా క‌ఠినంగా ఉంటుంద‌ట‌.. అందుకే ఈటెల ఏనాటికైనా కేసీఆర్ చేతిలో బ‌లికాక త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్న త‌రుణంలో ఈ స్కాం బ‌య‌టికి వ‌చ్చింది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. మాజీ హెంమంత్రి నాయిని న‌ర్సింహ‌రెడ్డి కూడా కేసీఆర్‌ను ఇటీవ‌ల వ్య‌తిరేకించారు. దీంతో కేసీఆర్‌కు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్లుగా అయింది. అయితే ఈ ఈఎస్ఐ స్కాంలో నాయిని న‌ర్సింహారెడ్డి అల్లుడు, జీహెచ్ ఎంసీ కార్పోరేట‌ర్ శ్రీ‌నివాస‌రెడ్డి కూడా ఇరుక్కున్నారు. అంటే కేసీఆర్‌ను వ్య‌తిరేకించిన ఇద్ద‌రు నేత‌ల‌ను ఒకే కుంభ‌కోణంలో టార్గెట్ చేసిన‌ట్లుగా తెలిసిపోతుంది. దీనికి తోడు నీలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో జ‌రుగుతున్న క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల మెడ‌కు చుట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.

నీలోఫ‌ర్‌లో క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ గ‌త ప‌దేండ్లుగా సాగుతున్నాయ‌ట‌. అయితే ఇప్పుడు వెలుగు లోకి రావ‌డంతో ఇది కూడా ఈటెల మెడ‌కు చుడితే ఓ నిర‌స‌న గ‌ళం మూగ‌బోతుంద‌నేది పాల‌కుల ఆలోచ‌న‌గా ఉంద‌నేది ప్ర‌చారం. అంటే క‌ట్టె విరుగొద్దు పాము చావొద్దు.. కానీ వ్య‌వ‌హారం చ‌క్క‌బ‌డాలే అనే ఆలోచ‌న‌లో నిర‌స‌న గ‌ళం వినిపించొద్దు.. త‌న చెప్పుచేతుల్లో ఉండాలి.. అంటే ఏదో కుంభ‌కోణంలో ఇరికిస్తే ఇక చ‌చ్చిన‌ట్లు త‌న మాటే వింటారు.. త‌న వెనుకే న‌డుస్తారు. తోక జాడించ‌రు అని ఇలా స్కామ్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదేమైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేంద‌ర్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాడు అనే టాక్ ఉంది. ఎంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసినా ఏమీ లాభం లేదు… నిరస‌న గ‌ళం విప్ప‌కుండా అస‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసినా ప‌ర్వాలేదట‌.. సో ఈటెల మెడ‌కు ఈఎస్ఐ, నీలోఫ‌ర్ కుంభ‌కోణాలు చుట్టుకోనున్నాయా.. ఈటెల ఈ కుంభ‌కోణాల పేరుతో బ‌లి కానున్నారా అనేది కాలం నిర్ణ‌యిస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles