26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

లాక్‌డౌన్‌లో పెరిగిన ఆత్మహత్యలు..

లాక్‌డౌన్ సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య అధికంగా ఉంద‌ని పుణె‌లోని ససూన్ ప్రభుత్వ ఆస్పత్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెల చివ‌రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం విదిత‌మే. ఆ సమయంలో ఒక్క ససూన్ ఆస్పత్రి పరిధిలోనే 29 మంది బాధితులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా మే నెలలో 40 మంది ఆ విధంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసులు నమోదు అయ్యాయి. ఇక జూన్ మధ్య నాటికి 39 ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇప్పటి వరకు ససూన్ ఆస్పత్రి పరిధిలో లాక్‌డౌన్ సమయంలో 108 ఆత్మహత్య కేసులు నమోదు కావ‌డం విశేషం. వీరంతా మానసిక ఒత్తిడి కారణంగానే చనిపోయారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క ససూన్ ఆస్పత్రి పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఏలా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

ఇక ఆత్మ‌హ‌త్య‌ల విష‌యానికొస్తే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలకు (ఇంపల్సివ్‌ సూసైడ్‌) పాల్పడేవాళ్లు ఉంటారు. అలాగే దీర్ఘకాలం ఆలోచించి, కచ్చితమైన ప్రణాళిక వేసుకుని, ప్లాన్‌డ్‌ సూసైడ్‌లకు పాల్పడేవారూ కూడా ఉంటారు. మొదటి కోవకు చెందిన వారి ఆత్మహత్యలకు కారణం పగ, ప్రతీకారం కావచ్చు. ఎవరినో తప్పు పట్టడం, అపరాధభావానికి లోను కావ‌డం కూడా కావచ్చు. వీళ్లు ఆ ప్రయత్నానికి ముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాస్తుంటారు. ఇలాంటి వారు పాల్పడే ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువ శాతం ఫెయిల్‌ అవుతుంటాయి. నిజానికి భయపెట్టడానికో, బెదిరించడానికో ఇలాంటివారు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటార‌ట‌. కొన్ని సందర్భాల్లో ఇవి శ్రుతిమించి ప్రాణాలు పోగొట్టుకున్న‌వారు కూడా ఉంటారు.

ఇక ప్లాన్‌డ్‌ సూయిసైడ్‌ కోవకు చెందినవారు ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుంటార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇటువంటివారు మొదటి ప్రయత్నంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటార‌ట‌. ఈ కోవకు చెందిన వారికి ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడమే లక్ష్యం కాబట్టి, ఎవరికీ ఎటువంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదనే భావనతో ఉంటారు. అయితే మాన‌సిక కుంగుబాటుతో బాధ‌ప‌డుతున్న‌వారిలో చాలామంది త‌మ‌ సన్నిహితులతో తమ‌ బాధలను వ్యక్తపరుస్తారు. కొందరు తెలివైన బాధితులు ఎంత‌కూ బయట ప‌డ‌రు. ఇదే నిర్ణ‌యం వారిని అంతిమంగా బలిగొంటుంది. ఆత్మీయులతో మనసులోని బాధలను పంచుకుంటే, 80శాతం ఆవేద‌న దూరమవుతుంద‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు‌. అందుకే ఎవ‌రైనాస‌రే త‌మ‌లోని బాధలను స‌న్నిహితుల‌తో పంచుకోవాలి. కుంగుబాటుకు కారణాలను ఎదుటివారి ముందు వ్యక్తపరచాలి. అణచిపెట్టుకున్న ఉద్వేగాలను బ‌య‌ట‌పెట్టాలి. అప్పుడే వారు ఆత్మ‌హ‌త్యా భావ‌న నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతార‌ని మాన‌సిన వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles