36.6 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

డిప్రెష‌న్‌ను దూరం చేసే పుట్ట‌గొడుగులు…

ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మందిని బాధిస్తున్న స‌మ‌స్య మానసిక కుంగుబాటు(డిప్రెష‌న్‌). దీనిని దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయ‌ని పరిశోధకులు తేల్చిచెప్పారు. పుట్ట‌గొడుగుల్లో మెదడును రీసెట్ చేసే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్ల‌డ‌య్యింది. డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా అనే విషయంపై లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.

పుట్టగొడుగుల నుంచి తీసిన ‘సైలో సైబిన్’ అనే పదార్ధాన్ని మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 19 మందికి అందించారు. దీనిని వారు తిన్న‌ తర్వాత వారి మెదడులో మంచి మార్పులు వచ్చాయని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. సైలోసైబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన ఒక రోజు తర్వాత రోగుల మెదడును స్కాన్ చేసి, మెదడులో జ‌రిగిన‌ కీలక మార్పులను గుర్తించారు. అయితే ఈ అధ్యయనం డిప్రెషన్‌లో ఉన్న వారిపై మాత్రమే నిర్వహించారు. దీనిమీద ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాలని వారు అంటున్నారు.

పుట్ట‌గొడుగులు- ఆసక్తిక‌ర వివ‌రాలు
పుట్టగొడుగు అనేది ఒక ఫంగస్. మొక్కల మాదిరిగా కాకుండా, పుట్టగొడుగులు సూర్యరశ్మి మీద ఆధారపడి మ‌నుగ‌డ సాగించ‌వు. ప్రపంచవ్యాప్తంగా సుమారు14,000 జాతుల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఎప్పుడూ తేమ‌తో కూడిన అడవులలో కనిపిస్తాయి. అలాగే కొన్ని జాతులు నీటిలో కూడా మొలుస్తాయి. సాధారణ పుట్టగొడుగులో కాండం మరియు దాని దిగువ భాగంలో మొప్పలు ఉన్న టోపీ ఉంటుంది. పుట్టగొడుగు మొక్క లేదా జీవి కాదు. పుట్టగొడుగులు చనిపోయిన మొక్కలను రీసైకిల్ చేసి విలువైన పోషకాలను భూమిలోకి తిరిగి పంపుతాయి. నూనెలు, పురుగుమందులు మరియు పారిశ్రామిక వ్యర్థాలు త‌ర‌హా ప్రమాదకరమైన పదార్ధాల క్షీణతకు ఇవి ఉప‌యుక్త‌మ‌వుతాయి.

పుట్టగొడుగు మంచి పోషకయుక్త‌ ఆహారం. రాగి మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు చాలా రకాల పుట్టగొడుగులలో విటమిన్ బి, కాపర్, పొటాషియం ఉంటాయి. ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చైనీస్ ఔషధాల తయారీలో పుట్టగొడుగులను కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో అరటిపండులో ఉండేదాని క‌న్నా అధిక‌ పొటాషియం ఉంటుంది. ఆధునిక అధ్యయనాలు పుట్టగొడుగులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేటరీ మరియు యాంటీఆక్సిడెంట్లుగా ఉపయోగపడతాయని తెలియ‌జేస్తున్నాయి

రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని నివారించ‌డానికి అనేక రకాల క్యాన్సర్‌తో పోరాడటానికి పుట్ట‌గొడుగు సహాయకారిగా ప‌నికివ‌స్తుంది. కుళ్ళిన‌ పదార్ధాలున్న చోట ఇవి పెరుగుతుంటాయి కాబట్టి మష్రూమ్స్ అంటే ఒక రకమైన ఏహ్యభావం క‌ల‌గ‌డం సహజం. ఆహారంలో ఉపయోగించే అత్యంత ఆద‌ర‌ణ‌ పొందిన పుట్టగొడుగులను వైట్ బటన్ పుట్టగొడుగులు అంటారు. ప్రపంచంలో వీటిని అత్యధికంగా ఉత్పత్తి చేసేది చైనా, ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తిలో సగం చైనా వాటానే ఉంటుంది. అడవుల్లో అత్య‌ధికంగా విషపూరిత పుట్టగొడుగులు ఉంటాయి. ఇవి తినదగిన రకాల మాదిరిగానే క‌నిపిస్తాయి. అందుకే పుట్టగొడుగుల గురించి బాగా తెలిసిన వారే అడవిలో ల‌భించే పుట్టగొడుగులను సేకరించాలి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles