22.9 C
Amaravathi
Thursday, December 9, 2021
spot_img

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్..?

హైదరాబాద్‌లో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కొద్ది రోజుల పాటు తిరిగి లాక్‌డౌన్ విధించే విషయమై అవసరమైతే మూడునాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు. నగరంలో తిరిగి 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ఆయన తెలిపారు.హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న అతిపెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లోనూ ఈ పరిస్థితి ఉండడం సహజం. లాక్‌డౌన్ ఎత్తివేసిన‌ తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి తిరిగి లాక్‌డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయమ‌ని, ఇందుకు ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందుకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంద‌న్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని వివ‌రించారు. పాజిటివ్ కేసులు ఎక్కువైనంత మాత్రాన భయాందోళనకు లోనుకావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లూ చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా కరోనావైరస్ విషయంలో తెలంగాణలో మరణాల సంఖ్య జాతీయ సగటుతో పోల్చిచూస్తే చాలా తక్కువగావుంద‌ని, ప్రజలు పెద్దగా భయపడాల్సిందేమీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలిన బాధితుల‌కు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామ‌ని, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది పడకలు సిద్ధం చేశామ‌న్నారు. పరిస్థితి విష‌మంగా ఉన్న రోగులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామ‌ని, వ్యాధి లక్షణాలు లేని వారికి హోంక్వారంటైన్‌లోనే చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో ఉన్న వివ‌రాల ప్ర‌కారం తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంద‌న్నారు.‌ కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది 1.52 మాత్రమేన‌ని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున క‌రోనా పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని, పాజిటివ్‌గా తేలిన వారికి తగిన వైద్యం అందిస్తున్నామ‌నా ఈటల తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles