Home కరెంట్ ఎఫైర్స్ జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు…

జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు…

0

మహారాష్ట్రలో కరోనా కేసులు అంత‌కంత‌కూ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా జూలై 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు విడుద‌ల చేసింది. అలాగే కొత్త మార్గదర్శకాల‌ను కూడా విడుదల చేసింది. దేశంలో మిగిలిన‌ ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. మ‌హారాష్ట్ర‌లో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 86,575 మంది డిశ్చార్జి కాగా, 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పటికే పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

దేశంలో లాక్‌డౌన్-3 వరకూ పెద్దగా మినహాయింపులు ఇవ్వ‌లేదు. అయితే లాక్‌డౌన్-4, 5లో నిబంధనల‌ను చాలా వరకూ సడలించడంతో ఇప్పడు దాదాపు లాక్‌డౌన్ లేద‌నే పరిస్థితులే క‌నిపిస్తున్నాయి. ఇటువంటి త‌రుణంలో ఐదో లాక్‌డౌన్ జూన్ 30తో ముగుస్తున్న తరుణంలోప్రధాని నరేంద్ర మోదీఇకపై లాక్‌డౌన్ ఉండదని, అన్‌లాక్-1 ప్రారంభమైందని తెలిపారు. అంటే జూన్ 30 తర్వాత అన్‌లాక్-2 ప్రారంభ‌మ‌వుతుంద‌ని భా‌వించ‌వ‌చ్చు.
అయితే వివిధ రాష్ట్రాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో తిరిగి మ‌రోరెండు వారాలు లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి హైదరాబాద్‌లో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతుండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. అయితే ఏపీ ప్రభుత్వం… కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు తన నిర్ణయాలు తీసుకుంటోంది. కాబట్టి ఏపీలో అన్‌లాక్-2 ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే కరోనా ఉన్న ఏరియాల్లో కఠిన నిబంధ‌న‌లు అమలు చేసే అవ‌కాశం ఉంది.

దేశంలోనే ఎక్కువ కేసులు ఉన్న మహారాష్ట్రలో లాక్‌డౌన్ కొనసాగనుంది. అయితే ఇది ఎంతకాలం కొనసాగించేదీ ప్రభుత్వం చెప్పలేదు. కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమన్న సీఎం ఉద్ధవ్ థాక్రే… అత్యవసర సరుకుల కోసం మాత్రమే ప్ర‌జ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు రావాలని కోరారు. కర్ణాటకలో ప్రతి ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని అక్క‌డి ప్రభుత్వం నిర్ణ‌యించింది. జులై 5 నుంచి ఈ విధానం అమలుకానుంది. ఆదివారం నాడు నిత్యవసరాలు మాత్రమే లభిస్తాయి. ప్రతి శనివారం ప్రభుత్వ ఆఫీసుల్ని మూసేయాలని కూడా ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కాంచీపురం, చెన్నై, చెంగల్ పేట్, తిరువళ్లూరు, మధురై త‌దిత‌ర ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ పొడిగించబోతోంది. నిత్యవసరాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని చెప్పింది.

ఇక బెంగాల్‌లో జులై 31 వరకూ లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఇందుకు ప్రతిపక్షాలు భిన్నంగా స్పందించినా సీఎం మమతా బెనర్జీ లాక్‌డౌన్ నిర్ణ‌యానికే మొగ్గుచూపారు. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లన్నీ జులై 31 వరకూ మూసివేయ‌నున్నారు. ప్రభుత్వ ఆఫీసులు 70 శాతం ఉద్యోగులతోనే ప‌నిచేయ‌నున్నాయి. మణిపూర్‌లో జులై 15 వరకూ లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాగే అసోంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో 15 రోజులు లాక్‌డౌన్ విధించ‌నున్నారు. జార్ఖండ్ కూడా జూలై 31 వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. గ‌తంలో లాక్‌డౌన్ వద్దన్న రాష్ట్రాలే స్వయంగా పొడిగిస్తున్నాయి. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌ధ్యంలో ఆయా రాష్ట్రాలు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయ‌ని స‌మాచారం.

Exit mobile version