వినియోగదారులకి శుభవార్త.

ఇప్పటిదాకా ఆకాశాన్ని అంటిన పప్పుల ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి. ఇటీవల వరకు వీటి ధరలు చుక్కలు చూపించాయి. అయితే క్రమంగా ధరలు దిగివస్తున్నాయి.

నెలరోజుల వ్యవధిలో అనూహ్యంగా కిలోకు రూ.10 నుంచి రూ.40 వరకు ధరలు తగ్గాయి. కొన్ని నెలల క్రితం కందిపప్పు గరిష్ట రేట్ కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ ధరలు నియంత్రించింది. ఆ తరువాత క్రమేపీ తగ్గుతూ వచ్చిన ధర అనూహ్యంగా ఇప్పుడు రూ.90కు చేరింది.

గతేడాది డిసెంబర్‌లో కిలో మినప పప్పు రూ.150 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం ఇది కిలో రూ.110కి లభిస్తుంది. పెసరపప్పు కిలో ధర రూ.120 నుంచి రూ.80కి పడిపోయింది. అయితే నష్టపోతామనే ఉద్దేసంతో తగ్గిన ధరల మేరకు విక్రయాలు చేసేందుకు కొందరు హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు ముందుకు రావడం లేదు. గతంలో మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోనూ పంట దిగుబడులు తక్కువగా ఉండటం వల్ల మయన్మార్‌, దిక్షణాఫ్రికాల నుండి దిగుమతి చేసుకున్నారు.

దీంతో అప్పట్లో కందిపప్పు ధర అనూహ్యంగా పెరిగింది. ఈ సారి గుంటూరు జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ కంది పంట విపరీతంగా వేశారు. వాతావరణం అనుకూలించి పంట బాగా పండింది. పండిన పంట నవంబర్‌ మొదటి వారం నుంచే మార్కెట్‌కు వస్తోంది. ఇప్పుడు అది కాస్తా ఊపందుకుంది. జనవరి ఒకటి నుంచి ఇంకా ఎక్కువ దిగుబడులు మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. దీని వల్ల ఇప్పుడు ధరలు భారీగా తగ్గుతున్నాయి.

You might also like