snaxngrox.com Free Shipping

పబ్లిక్‌ వైఫై వాడితే అకౌంట్లు హ్యాక్?

ఇప్పుడు మారుతున్నకాలానికి అనుగుణంగా షాపింగ్‌ మాల్స్‌, కాఫీ షాప్స్‌, ఎయిర్‌ పోర్ట్స్‌, రైల్వే స్టేషన్స్‌ ఇలా అనేక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై హాట్‌ స్పాట్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా యువత ఫ్రీ-వై-ఫై కోసం షాపింగ్‌ మాల్స్‌, కాఫీ షాప్స్‌ లో చాలా సమయం వృధా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

పబ్లిక్‌/ఫ్రీ వై-ఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ సెక్యూరిటీ పరంగా చాలా రిస్క్స్‌ ఉన్నాయి. పబ్లిక్‌ వై-ఫైను వినియోగించే కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా హ్యాక్‌ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే పబ్లిక్‌ వై-ఫైతో కనెక్ట్‌ అయి ఉన్నపుడు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, షాపింగ్‌ వంటి లావాదేవీలు నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. కొన్ని పబ్లిక్‌ వై-ఫైల వద్ద పాస్‌ వర్డ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం కారణంగా మీ డేటాను హ్యాకర్లు సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉంది.

కాబట్టి అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే పబ్లిక్‌ వై-ఫైను ఎంపిక చేసుకోండి. మార్గమధ్యంలో ఆన్‌ లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను వినయోగించుకోవాల్సి వస్తే పబ్లిక్‌ వై-ఫైకు బదులుగా మొబైల్‌ డేటాను ఉపయోగించుకోండి. అలాగే పబ్లిక్‌ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దు. ఈ చర్య మీ వ్యక్తిగత డేటాకి ప్రమాదం కావొచ్చు.

కొన్ని పబ్లిక్‌ వై-ఫై కేంద్రాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ల ముసుగులో మాల్వేర్లతో కూడిన ప్రోగ్రామ్‌లను మీ డివైస్‌ల్లోకి జొప్పించి మీ డేటాను దొంగిలించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్‌ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌ లను ఇన్‌స్టాల్‌ చేసుకోకండి.

మీరు వినియోగించే మీ స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌ టాప్‌లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా మీ డివైస్‌ను హ్యాకర్ల చేతిలో పెట్టినట్లే. ఒక వేళ మీరు ల్యాప్‌ టాప్‌ వాడుతున్నట్టయితే విండోస్‌ పీసీలో ఫైర్‌ వాల్‌ ను తప్పనిసరిగా ఎనేబుల్‌ చేసి ఉంచాలి. అలానే మీ స్మార్ట్‌ ఫోన్‌లో యాంటీ వైరస్‌ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌ స్టాల్‌ చేయాలి. తరచూ లేటెస్ట్‌ ఓఎస్‌ అప్‌డేట్‌లను పొందటం ద్వారా కూడా సెక్యూరిటీ సమస్యల నుంచి బయటపడొచ్చు.

You might also like